మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు బుధవారం ప్రభుత్వంలో ఉన్న అధికారలకు జైలు శిక్ష, జరిమానా విధించింది. 2018లో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో రైతుల అభ్యంతరాలు వినకుండా అధికారులు డిక్లరేషన్, అవార్డును ఇచ్చారని బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను రైతులకు తెలపాలని, అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోని విచారణ జరిపి ఆర్డర్‌ను రైతులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
అయితే 2019 మే లో హైకోర్టు ఆదేశాలను పాటించకుండా అధికారులు డిక్లరేషన్, అవార్డును ప్రకటించారని మరోసారి రైతులు కోర్టు మెట్లు ఎక్కారు. బుధవారం ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు.. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు రూ. 2వేలు జరిమానా విధించింది. ఒకవేళ నాలుగు వారాలల్లో జరిమానా చెల్లించకపోతే ఒక నెల జైలు శిక్ష పడుతుందని కోర్టు హెచ్చరించింది. అదేవిధంగా సిద్దిపేట ఆర్డీఓ జయచందర్‌రెడ్డికి రెండు నెలల జైలు శిక్షతోపాటు రూ.2 వేలు జరిమానాను హైకోర్టు విధించింది. దీంతోపాటు 12 మంది పిటిషనర్లకు రూ. 2 వేల చొప్పున అధికారాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.